CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Saturday, September 18, 2010

లీలానాయుడు




ఆమె ఒక మనోహరమైన స్త్రీ. ఒక కథ. ఒక జ్ఞాపకం. భారతదేశం చలనచిత్ర జగత్తలో ఒక వెలుగు వెలిగిన అలనాటి అందాల నటీమణి లీలానాయుడు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి కి చెందిన ప్రముఖ న్యూక్లియర్ ఫిసిస్ట్ రామయ్య నాయుడు గారి కుమార్తె లీలానాయుడు. తల్లి ఫెంఛ్ దేశస్తురాలు.1954లో మిస్ ఇండియా గా ఎన్నుకోబడింది. అప్పట్లో "వోగ్" అనే పత్రికవారు ప్రపంచంలోని పదిమంది అత్యంత సుందరీమణూల్లో ఈమెను ఒకతెగా ప్రకటించారు. ఆమె మొదటి చిత్రం హృషీకేష్ ముఖర్జీ తీసిన "అనురాధ(1960)". నాకెంతో ఇష్టమైన సినిమాలలో అది ఒకటి. ఆ సినిమాకు ఆ సంవత్సరంలో నేషనల్ అవార్డ్ కూడా లభించింది. సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమెకు నటిగా పేరును తెచ్చిపెట్టింది. ఆమె ఆంగ్ల నటి "సోఫియా లారెన్" తో పోల్చబడింది కూడా.

తరువాత 1962లో ఆమె "ఉమ్మీద్" అనే చిత్రం చేసారు. వివాదాస్పదమైన నానావతి మర్డర్ కేస్ ఆధారంగా చిత్రించిన "యే రాస్తే హై ప్యార్ కే(1963) సినిమాలోని ఆమె నటన దేశవ్యాప్తంగా గుర్తింపుని, మన్ననలనూ పొందింది. అదే సంవత్సరంలో లీలానాయుడు జేమ్స్ ఐవొరీ తీసిన "ద హౌస్ హోల్డర్" అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆమెకు ఎంతో ప్రతిష్ఠను సంపాదించిపెట్టిండి.

సత్యజిత్ రాయ్ కూడా ఆమె నటనను ఎంతో ప్రశంసించి "ద జర్నీ" అనే సినిమా తీయాలని సంకల్పించారు కానీ చేయలేకపోయారు. రాజ్ కపూర్ ఆమెతో చిత్రాలు తీయాలని ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతారు. ఒకసారి ఒప్పుకుని సెట్స్ కు కూడా వెళ్ళి ఆ తరువాత మరో నాలుగు చిత్రాలకు బాండ్ రాయటానికి ఇష్టపడక షూటింగ్ విరమించుకుని వెళ్ళిపోయరుట. "ద గురు(1969)" అనే సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించిన తరువాత లీలానాయుడు నటించటం మానివేసారు.

ఇరవైయేళ్ళు నిండకుండానే ఆమె బిక్కీ ఓబ్రాయ్ అనే పారిశామికవేత్తను వివాహమాడారు. ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె మొదటి వివాహం ఎక్కువకాలం నిలవలేదు. ఆ తరువాత "డోమ్ మోరిస్" అనే కవిని వివాహమాడి పదేళ్ళు విదేశాల్లోనే భర్తతో గడిపారు. పత్రికా రంగంలో పేరున్న వ్యక్తి ఆయన. డోమ్ మోరిస్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ట్రాన్సలేటర్ గా వ్యవహరించారు. పలు పత్రికల్లో ఎడిటర్ గా, కొన్ని ఇతర దేశీయ చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసారు లీలానాయుడు.

ఎందువల్లనో ఆమె రెండవ వివాహం కూడా నిలవలేదని అంటారు. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్ళీ శ్యామ్ బెనిగల్ "త్రికాల్(1985)"లో ఆమె నటించారు. ఆమె చివరిసారిగా నటించినది 1992లో. కోర్టు ఆమె ఇద్దరు కుమర్తెల సంరక్షణను మొదటి భర్తకు అప్పగించింది. ఆ కేసును ఓడిపోయాకా ఆమె చాలా కృంగిపోయారు. తరువాత గొప్ప తత్వవేత్త అయిన జిడ్డుకృష్ణమూర్తి గారి బొధనల పట్ల ఆమె ఆకర్షితులై ఆయన శిష్యులైయ్యారు. దీర్ఘకాల అనారోగ్యం తరువాత 69 ఏళ్ళ వయసులో లీలానాయుడు కన్ను మూసారు. చిన్నవయసులోనే ఎంతొ ఖ్యాతి గడించిన ఆమె...ఎందరికో ఆరాధ్యమైన ఆమె జీవితంలో ఎన్ని విషాదాలో...!


కానీ భారతీయ చలనచిత్ర రంగంలో గుర్తుంచుకోదగ్గ మంచి నటి, అపురూప సౌందర్యవతి లీలానయుడు. ఆమె జెర్రి పింటో తో పంచుకున్న జ్ఞాపకాలను "ఏ పేచ్ వర్క్ లైఫ్" అనే పుస్తకంగా పెంగ్విన్ బుక్స్ వాళ్ళు ప్రచురించారు.

యూట్యూబ్ లో దొరికిన లీలానయుడు క్లిప్పింగ్స్:




Friday, September 3, 2010

Spirit: Stallion of the Cimarron (2002)



యానిమేషన్ చిత్రాలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.Walt Disney movies, Willow, Madagaskar, Pocahontas,Tarzan, Kung-fu panda, The Lion King, Aladdin,The jungle book, Bambi మొదలైనవి నాకెంటో ఇష్టమైన యానిమేషన్స్. ఈ "Spirit" సిడీ ఒకసారి అన్నయ్య నాకు కాపీ చేసి ఇచ్చాడు. నాకు బాగా ఇష్టం. నిరాశగా ఉన్నప్పుడు, మూడ్ బాలేనప్పుడూ ఉత్సాహం తెచ్చుకోవటానికి ఈ సినిమాను చూస్తూంటాను నేను.

2002లో Dream Works Pictures ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమా పిల్లలనే కాక పెద్దలను కూడా ఎంతో ఆకట్టుకుంది. "Cimarron" అనే గుర్రపుమందకు నాయకుడైన "Spirit" అనే Stallion(మగ గుర్రం) కధ ఇది. యానిమేషన్ చిత్రాల్లోకెల్లా విభిన్నంగా ఉంటుంది ఈ సినిమా. నాయకుడైన స్పిరిట్, Cimarron తెగలోని ఇతర గుర్రాలు, తమ తోటి గుర్రాలతో సైగలతో, విభిన్న శబ్దాలతో చేసే భావ ప్రకటనలు ఈ చిత్రం లోని ప్రత్యేకత. చూడటనికి ఎంతో మనోహరంగా, మనసుకు హత్తుకునేలా ఉంటాయి ఆ హావభావాలు. స్పిరిట్ పుట్టడం, పెరగటం, తన తెగను ఆపదలనుండి రక్షించటం, బాధ్యత తెలుసుకుని నాయకునిగా నిలవటం మొదలైన దృశ్యాలు చాలా హృద్యంగా యానిమేట్ చేసారీ సినిమాలో.



కథ ఏమిటంటే, "Cimarron" తెగను నాయకుడై కాపాడుతున్న "Spirit" ను ఆర్మీ సైనికులు బంధించి తీసుకుపోతారు. అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో, అక్కడికే బందీగా వచ్చిన "లిటిల్ క్రీక్" అనే లకోటా(ఒక నేటివ్ అమెరికన్ తండా)కుర్రాడితో స్నేహం కుదురుతుంది. ఇద్దరూ ఎలాగో తప్పించుకుంటారు. Spirit ను లిటిల్ క్రీక్ తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ అతని పెంపుడుజంతువైన Rain అనే ఆడగుర్రం(it's a paint mare -- an american horse breed with distinct characteristics)తో ప్రేమలో పడతాడు. అక్కడ నుండి తన తెగ ఉన్న చోటకు వెళ్ళేలోపూ మళ్ళీ ఆర్మీ సైనికులు లకోటా తండాపై దండెత్తుతారు.

తప్పించుకునే ప్రయత్నంలో Rain తీవ్రంగా గాయపడుతుంది. మరోసారి Spirit ను ఆర్మీ సైనికులు బంధించి తీసుకుపోతారు. అతడిని విడిపించాలని లిటిల్ క్రీక్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? Spirit మళ్ళీ Rainను కలుస్తాడా? అతికష్టమైన ఆర్మీ నిర్భంధం లోంచి Spirit ఎలా తప్పించుకుంటాడు, స్వేచ్చను తిరిగి ఎలా పొందుతాడు అన్నది మిగిలిన కథ. పోరాడి, పోరాడి చాలా అలసిపోయి నిస్సత్తువగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఎలాగైనా స్వేచ్చను పొందటం కోసం Spirit చూపే స్థైర్యం, తెగువ, మనోబలం ఎంతో అబ్బురపరుస్తుంది. పట్టుదల ఎంతటి సాహసాన్నైనా చేయించగలదు; ప్రయత్నంతో సాధించలేనిదేది లేదు అనే సత్యాలను తెలుపుతుంది.

ఈ సినిమా ట్రైలర్:



2002లో అకాడమీ అవార్డ్స్ కు ఈ సినిమా "బెస్ట్ యానిమేషన్ ఫీచర్" గా నామినేట్ చేయబడింది. ఈ చిత్రానికి Lorna Cook మరియు Kelly Asbury దర్శకత్వం వహించారు. Hans Zimmer మరియు Bryan Adams మనోహరమైన సంగీతాన్ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. ఈ సినిమాలోని Bryan Adams పాడిన
"here iam this is me" అనే పాట నాకు ఇష్టం.